తిరుచానూరు, నవంబర్ 23: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం, రాత్రి వాహనసేవలు జరుగుతున్నాయి. ఈ వాహనాలను భుజాలపై మోస్తూ ఆలయ నాలుగు మాడ వీధుల్లో తిప్పుతున్నది తమిళనాడులోని శ్రీరంగం, పరిసర ప్రాంతాలకు చెందిన శ్రీవైష్ణవ సంప్రదాయపరులు. గత 35 ఏళ్లుగా ఈ అదృష్ట సేవను అందిస్తున్న 50 మందికిపైగా వైష్ణవ భక్తులు ఈ బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఒక్కో వాహనం 2.5 టన్నులకుపైగా బరువు ఉంటుంది. మర్రి ఊడలతో చేసిన 28 అడుగుల పొడవైన నాలుగు తండ్లు, కొయ్య అడ్డపట్టీలు, గొడుగు పలకలు, అర్చకులు, గొడుగు పట్టేవారు… ఇవన్నీ కలిపి భారీ బరువు. మూడు గంటల పాటు ఈ బరువును భుజాలపై మోస్తూ నడవడం సామాన్య విషయం కాదు. భుజాలపై పుండ్లు, ఉబ్బెత్తు కాయలు ఏర్పడినా భక్తి భావం ముందు ఆ నొప్పులు కనిపించడం లేదని వాహన సేవకులు చెబుతున్నారు.
చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఐటీ, రైల్వే, బ్యాంకు, ప్రభుత్వ-ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నవారు, వ్యాపారస్తులు, విద్యార్థులు కూడా ఈ బృందంలో ఉన్నారు. బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి, ఖర్చులు పట్టించుకోకుండా వచ్చేస్తారు. టిటిడి వీరికి ఉచిత బస, భోజనం, వస్త్ర బహుమానం, ప్రయాణ భత్యం అందిస్తోంది. “సాక్షాత్తు శ్రీమహావిష్ణువు దేవేరి అయిన అమ్మవారిని మా భుజస్కంధాలపై మోయడం పూర్వజన్మ సుకృతం. అందరికీ ఈ అవకాశం రాదు. అమ్మవారి కృపతో మా జీవితాలు సుఖసంతోషాలతో నిండిపోయాయి” అంటూ శ్రీరంగం శ్రీవైష్ణవులు భావోద్వేగంతో చెబుతున్నారు. వాహనాన్ని ఒకేసారి భుజాల మీదకు ఎత్తడం, ఒకేసారి దించడం, నాలుగు రకాల నడకా విధానాలు పాటించడం… ఇవన్నీ వారి ఐక్యత, అనుశాసనం, భక్తి శ్రద్ధలకు అద్దం పడుతున్నాయి. శ్రీరంగనాథస్వామి ఆలయంలోనూ ఇదే సంప్రదాయంతో సేవలందిస్తున్న ఈ వైష్ణవులు తిరుచానూరులో అమ్మవారి వాహనసేవలో పాల్గొనడం గర్వకారణమని అంటున్నారు.
Hashtags:
#SrirangamVaishnavas #VahanaSeva #TiruchanurBrahmotsavam #PadmavathiAmmavari #Devotion #TTD #JaiPadmavathi #SriVaishnavaTradition