న్యూఢిల్లీ, డిసెంబర్ 3 : బంగారంపై రుణాలు (Gold Loans) తీసుకునే కోట్లాది మంది భారతీయులకు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ శుభవార్త అందింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న బంగారు రుణ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, వచ్చే ఏడాది కాలంలో ఎన్బీఎఫ్సీలు (NBFCs) దాదాపు 3,000 కొత్త బంగారు రుణ శాఖలను ప్రారంభించనున్నాయి. సెప్టెంబర్ నాటికి బంగారు రుణ మార్కెట్ ₹14.5 లక్షల కోట్లకు (Gold Loan Market) ఎగసి, రికార్డు స్థాయిని తాకింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ముత్తూట్ ఫైనాన్స్, IIFL ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance), L&T ఫైనాన్స్ వంటి ప్రముఖ ఎన్బీఎఫ్సీలు ఈ విస్తరణలో ముందుంటున్నాయి. బజాజ్ ఫైనాన్స్ ఒక్కటే 2027 నాటికి 900 కొత్త శాఖలను తెరవనుంది. ముత్తూట్, IIFL కలిపి 1,800కి పైగా శాఖలు, L&T ఫైనాన్స్ ఈ ఏడాదే 200 శాఖలను ప్రారంభించనుంది.
కొత్త నిబంధనల ప్రకారం ప్రతి శాఖలో స్ట్రాంగ్ రూమ్, సీసీటీవీ, సెన్సార్లు తప్పనిసరి. ఒక్కో శాఖ ఏర్పాటుకు ₹8–20 లక్షల వరకు ఖర్చవుతుంది. శాఖలు లాభదాయకంగా మారడానికి 1.5 నుంచి 2 సంవత్సరాలు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ICRA రేటింగ్స్ ప్రకారం, FY26 నాటికి ఎన్‌బీఎఫ్‌సీల బంగారు రుణ ఆస్తులు 30–35 శాతం పెరుగుతాయని అంచనా. రైతులు, చిన్న వ్యాపారులు 70 శాతం రుణాలను వ్యవసాయం, వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తున్నారు. మిగిలినవి వివాహాలు, గృహ మెరుగుదల, అత్యవసర ఖర్చులకు వినియోగిస్తున్నారు.
బంగారం ధరలు ఆకాశాన్నంటడం, గృహాల్లో ఉన్న భారీ మొత్తంలో నిష్క్రియ బంగారం – ఈ రెండూ బంగారు రుణ మార్కెట్‌ను మరింత బలోపేతం చేస్తున్నాయి.
#GoldLoan #NBFC #BajajFinance #MuthootFinance #IIFLFinance #GoldLoanBoom