- కమ్యూనిస్టుల పూర్వవైభవం కోసం సైద్ధాంతిక పోరు అనివార్యం
తిరుపతి, డిసెంబర్ 3 : దేశంలో ఫాసిస్టు శక్తులు రాజ్యాంగాన్ని (Constitution) నెట్టివేసి ఫాసిస్టు రాజ్యాంగం (Fascist Constitution) నిర్మించేందుకు కుట్ర పన్నుతున్నాయని, దీనిని మూకుమ్మడిగా ఎదుర్కోవాలని కమ్యూనిస్టు నాయకులు పిలుపునిచ్చారు. తొలితరం కమ్యూనిస్టు కామ్రేడ్ గంధమనేని శివయ్య 47వ వర్ధంతి, భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం తిరుపతిలో గంధమనేని శివయ్య మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో వక్తలు ఈ విషయాన్ని గట్టిగా లేవనెత్తారు.
సీపీఐ(ఎం)ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, కార్పొరేట్ ప్రభంజనంలో కమ్యూనిస్టు పార్టీలు పార్లమెంటులో అడుగుపెట్టలేని దుస్థితి ఏర్పడిందని, ఒక్క సీటు కోసం కూడా బూర్జువా పార్టీలను వెంబడించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కమ్యూనిస్టు పార్టీలలో అంతరంగిక సమగ్ర సమీక్ష (Internal Review) అవసరమని, వైఫల్యాలపై చర్చించి పూర్వ వైభవం తిరిగి సాధించేందుకు సైద్ధాంతిక పోరు (Ideological Struggle) సాగించాలని పిలుపునిచ్చారు. ఫాసిస్టు పాలకులు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని హెచ్చరించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు డి.పాపారావు మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి ముందు నుంచి నేటి వరకు సుదీర్ఘ పోరాట చరిత్ర ఉన్న ఏకైక పార్టీ సీపీఐ అని, కమ్యూనిస్టులు బలహీనపడినా ఆ భావజాలం ఇప్పటికీ ప్రజల మనసుల్లో బలంగా ఉందని అన్నారు. సోవియట్ యూనియన్ పతనంతో కమ్యూనిస్టుల పని ఐపోయిందని చెప్పే వారికి బుద్ధి చెప్పేలా మళ్లీ బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలతో నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతుందని, దీనిని ప్రధాన అంశంగా తీసుకుని కమ్యూనిస్టులు పోరాడాలని సూచించారు.
రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ.రామానాయుడు అధ్యక్షోపన్యాసంలో గంధమనేని శివయ్య ఉమ్మడి జిల్లా పార్టీ కార్యదర్శిగా, పుత్తూరు నుంచి ఎమ్మెల్యేగా బలమైన పార్టీ ఉద్యమాన్ని నిర్మించిన మహానేతగా కొనియాడారు. సమావేశం ప్రారంభంలో శివయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజానాట్యమండలి కళాకారులు పాడిన ఉద్యమ గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి.