- రైల్వే మంత్రికి వైసీపీ ఎంపీలు మరోసారి విన్నపం
న్యూఢిల్లీ, డిసెంబర్ 3 : తిరుపతి జిల్లా రైల్వే సేవల బలోపేతం కోసం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను వైఎస్ఆర్సీపీ లోక్‌సభ ఎంపీ మద్దిల గురుమూర్తి, రాజ్యసభ ఎంపీ మేడా రఘునాధ రెడ్డి బుధవారం కలిశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బాలాజీ రైల్వే డివిజన్‌ను (Balaji Railway Division) తిరుపతి కేంద్రంగా వెంటనే ఏర్పాటు చేయాలని మంత్రిని ఆయనలు కోరారు. దేశంలోనే అత్యంత రద్దీ ఉన్న పుణ్యక్షేత్రం తిరుపతి అయినప్పటికీ ప్రస్తుతం రైల్వే లైన్లు పలు డివిజన్లలో విభజించబడడంతో పరిపాలనా జాప్యం, అనుమతుల ఆలస్యం, సేవల నాణ్యతలో లోపాలు ఎదురవుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రూ.300 కోట్లతో తిరుపతి రైల్వే స్టేషన్ అప్‌గ్రేడేషన్ జరుగుతుండడంతో డివిజన్ ఏర్పాటు మరింత అనివార్యమని ఎంపీ గురుమూర్తి గతంలో పార్లమెంటులో రెండుసార్లు ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు.
తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్లో అత్యవసరంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, పుత్తూరు యార్డ్ వద్ద ధర్మరాజుల గుడి ఎదుట రైల్వే ట్రాక్ సమస్య పరిష్కారానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ర్యాంపు ఏర్పాటు, వెందోడు, నాయుడుపేట స్టేషన్లలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్, భగత్ కి కోఠి, ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లకు స్టాపేజీలు, కృష్ణా ఎక్స్‌ప్రెస్, తిరుపతి–పూరీ, తిరుమల ఎక్స్‌ప్రెస్, తిరుపతి–గూడూరు ప్యాసింజరు రైళ్ల పునరుద్ధరణ వంటి అంశాలను కూడా మంత్రి ముందుంచారు. ఈ అభ్యర్థనలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎంపీలు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు.
#BalajiRailwayDivision #TirupatiRailway #AshwiniVaishnaw #MaddilaGurumoorthy #MedaRaghunathaReddy #YSRCP