విజయవాడ, డిసెంబర్ 3 : కాపు ఉద్యమ నాయకుడు, దివంగత వంగవీటి మోహనరంగా (Vangaveeti Mohana Ranga) వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న విశాఖపట్నంలో ‘రంగానాడు’ పేరుతో భారీ బహిరంగ సభ (Public Meeting) నిర్వహించనున్నట్లు రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ (Vangaveeti Asha Kiran) ప్రకటించారు.
బుధవారం విజయవాడలో రాధా రంగ రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘రంగానాడు’ పోస్టర్‌ను ఆశాకిరణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వంగవీటి శంతన్ కుమార్, గాదె బాలాజీ, ఆమంచి స్వాములు, సుధాకర్ నాయుడు సహా పలువురు కాపు సంఘాల నేతలు పాల్గొన్నారు.
“కుల, మత, రాజకీయాలకు అతీతంగా రంగా అభిమానులందరూ ఈ సభకు రావాలి. అన్ని పార్టీల్లో ఉన్న రంగా అనుచరులు చేయి చేయి కలిపి రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి” అని ఆశాకిరణ్ పిలుపునిచ్చారు. ‘చేయి చేయి కలుపు.. చేజారదు గెలుపు’ అనే తండ్రి స్ఫూర్తిని స్మరించారు.
ప్రస్తుతం ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని, ఏ పార్టీలో చేరడం లేదని ఆశాకిరణ్ స్పష్టం చేశారు. “రాధా రంగ మిత్ర మండలి (Radha Ranga Mitra Mandali) ద్వారా చారిటబుల్ కార్యక్రమాలు మాత్రమే చేస్తాను. ముందు మూడేళ్లు నా సేవా కార్యక్రమాలు ప్రజలు చూస్తారు. ఆ తర్వాతే రాజకీయ నిర్ణయం ఉంటుంది” అని తేల్చి చెప్పారు.
అన్న వంగవీటి రాధాకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవని, అనవసర గాసిప్స్‌కు ప్రచారం చేయవద్దని ఆమె కోరారు. డిసెంబరు 26న విశాఖలో జరిగే సభకు రాధాకృష్ణను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు.
అసోసియేషన్ కన్వీనర్ గాదె బాలాజీ మాట్లాడుతూ.. “2019లో రాధారంగ మిత్ర మండలి ఏర్పాటు చేశాం, 2023లో కాపునాడు సభ నిర్వహించాం. ఇప్పుడు రంగానాడు పేరుతో రాజకీయాలకు అతీతంగా భారీ సభ ఏర్పాటు చేస్తున్నాం. రంగా ఒక కులానికి చెందినవాడు కాదు, అన్ని వర్గాల అభిమాన నాయకుడు” అని పేర్కొన్నారు.
#VangaveetiRanga #Ranganadu #AshaKiran #VisakhapatnamMeeting #KapuCommunity #RadhaRanga