పార్వతీపురం మన్యం జిల్లా, నవంబర్ 23: “మా కూతురు పెళ్ళికి ఇల్లు, భూమి అమ్మేస్తాం… ఆస్తులన్నీ పోయినా పర్వాలేదు” అని అనుకున్న తల్లిదండ్రుల బాధ చూడలేక… “మీరు మా ఆధారం కోల్పోకూడదు” అని బతిమాలుకున్నా వినిపించుకోని ఆ పేద తల్లిదండ్రులు పెళ్ళి సంబంధం ఖరారు చేయడంతో… తీవ్ర మనోవేదనతో చినభోగిల గ్రామానికి చెందిన 19 ఏళ్ల అనూష (చుక్క అనూష) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సీతానగరం మండలం చినభోగిల గ్రామానికి చెందిన చుక్క శ్రీను, లక్ష్మీ దంపతులు వ్యవసాయ కూలీలు. పెద్ద కూతురు పెళ్ళి అయిన తర్వాత రెండో కూతురు అనూష ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు పూర్తి చేసి శిక్షణకు సిద్ధమవుతోంది. ఈ సమయంలోనే తల్లిదండ్రులు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కానీ తమ పెళ్ళి కోసం ఇల్లు-భూమి అమ్ముకోవాల్సి వస్తుందని తెలిసి అనూష తీవ్ర ఆవేదనకు గురైంది. “మీరు ఉన్నంత వరకే మాకు ప్రపంచం… ఆస్తులు అమ్మి మమ్మల్ని రోడ్డున పడేయొద్దు” అని ఎన్నిసార్లు బతిమాలుకున్నా తల్లిదండ్రులు వినలేదు.
పెళ్ళికొడుకు ఫ్యామిలీ కూతురు చూడడానికి రావడం, ఇంటికి ఏర్పాట్లు జరగడం చూసి తాళలేక… పెళ్ళిచూపులు జరగాల్సిన రోజే అనూష ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించినా… రెండు రోజులు మరణంతో పోరాడిన అనూష శనివారం రాత్రి మృతి చెందింది. చదువు పూర్తై మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రులను ఆదుకుంటుందని కలలు కన్న శ్రీను-లక్ష్మీ దంపతులు ఇప్పుడు కూతురి మృతదేహం పక్కన బోరున విలపిస్తున్నారు. “ఎంత పని చేశావ్ రా అనూష… నీ కోసమే బతికాం” అని తల్లి అంగలారుస్తోంది. పేద కుటుంబాల్లో పెళ్ళి ఖర్చుల ఒత్తిడి ఇలా ప్రాణాలు బలిగొంటుందని స్థానికులు దిగ్భృతి వ్యక్తం చేస్తున్నారు. సీతానగరం పోలీసులు కేసు నమోదు చేశారు.