తిరుపతి, డిసెంబర్ 3 : చిత్తూరు జిల్లా పరదరామి రిజర్వ్ ఫారెస్ట్‌లోని గుడ్డివాని చెరువు వద్ద గత నెల 30న గాయపడిన ఏనుగును రెస్క్యూ చేసి తిరుపతి ఎస్వీ జూపార్కుకు తరలించినా.. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది.
స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు, రెస్క్యూ బృందం మత్తుమందు ఇచ్చి ఏనుగును జూపార్కుకు తీసుకొచ్చారు. రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో పశువైద్యులు ద్రవాహారం (IV Fluids) ఇస్తూ చికిత్స అందించారు. అయినప్పటికీ ఏనుగు పరిస్థితి విషమించి మృతి చెందింది.
పశువైద్యులు నిర్వహించిన పోస్ట్‌మార్టంలో.. ఏనుగుల గుంపులో జరిగిన పోరాటంలో గాయాలు అవడం, ఎక్కువసేపు నీటి బురదలో ఉండటంతో ఇన్ఫెక్షన్ సోకి రక్తం విషపూరితమై (Septicemia) మరణించినట్లు తేలింది. ఎస్వీ జూపార్క్ అధికారులు పోస్ట్‌మార్టం అనంతరం ఏనుగును ఘనంగా ఖననం చేశారు.
#TirupatiZoo #ElephantDeath #PostMortem #Septicemia #ChittoorForest #SVZooPark