హర్యానా, డిసెంబర్ 3 : హర్యానాలో రూ.1.17 కోట్లకు ‘HR88B8888’ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ (Fancy Number Plate) గెలుచుకున్న వ్యక్తి డబ్బు చెల్లించడంలో విఫలమైన సంఘటనపై ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటోంది. రవాణా శాఖ మంత్రి అనిల్ విజ్ (Anil Vij) ఆదేశాల మేరకు బిడ్డర్ సుధీర్ కుమార్ (Sudhir Kumar) ఆస్తులు, ఆదాయంపై పూర్తి విచారణ (Investigation) జరపాలని శాఖ అధికారులకు సూచించారు.
నవంబర్ 26న ఆన్లైన్లో జరిగిన వేలంలో రూ.50,000 కనీస ధరతో ప్రారంభమైన ఈ బిడ్‌లో రోములస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సుధీర్ కుమార్ అత్యధికంగా రూ.1.17 కోట్లకు దక్కించుకున్నారు. అయితే, డిసెంబర్ 1తో ముగిసిన గడువులో డబ్బు చెల్లించలేకపోయి కేవలం రూ.11,000 సెక్యూరిటీ డిపాజిట్‌ను వదులుకున్నారు.
ఈ విషయంపై మంత్రి అనిల్ విజ్ తీవ్రంగా స్పందించారు. “వేలంలో పాల్గొనడం హాబీ కాదు, బాధ్యత. ఆర్థిక స్థిరత్వం లేకుండా ధరలు పెంచేవారిని నిరోధించడానికే ఈ చర్యలు” అని ఆయన స్పష్టం చేశారు. సుధీర్ కుమార్ ఆస్తులపై విచారణల తర్వాత అవసరమైతే ఆదాయపు పన్ను శాఖకు కూడా లేఖ రాస్తామని తెలిపారు.
బిడ్డర్ సుధీర్ కుమార్ స్పందిస్తూ సాంకేతిక సమస్యలు, కుటుంబ సభ్యుల అభ్యంతరాలే కారణమని చెప్పుకొచ్చారు. ఒక నంబర్ ప్లేట్ కోసం ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేయడానికి కుటుంబం అంగీకరించలేదని, వారితో చర్చిస్తున్నట్లు తెలిపారు. అధికారులు ఈ నంబర్ ప్లేట్‌ను మళ్లీ వేలానికి ఉంచనున్నారు.
#FancyNumberPlate #HaryanaAuction #SudhirKumar #AnilVij #Investigation